విడుదల తేదీ : 26 సెప్టెంబర్ 2014 TeluguWorld.wap.sh : 3.75/5 దర్శకుడు : శ్రీవాస్ నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్ సంగీతం : అనూప్ రూబెన్స్ నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్..
‘లక్ష్యం’ లాంటి సూపర్ హిట్ మూవీ అందించిన కాంబినేషన్ లో మాచో హీరో గోపీచంద్ మరోసారి శ్రీ వాస్ తో కలిసి చేసిన సినిమా ‘లౌక్యం’. గోపీచంద్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీధర్ సీపాన కథ – మాటలు అందించాడు. యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ మిక్స్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సాహసం’ సినిమా తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం గోపీచంద్ చేసిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ ‘లౌక్యం’ గోపీచంద్ కి కమర్షియల్ హిట్ ఇచ్చిందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ (గోపీచంద్) తన ఫ్రెండ్ ప్రేమ కోసం వరంగల్ లో దాదా అయిన బాబ్జీ(సంపత్) చెల్లెల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తాడు. దాంతో బాబ్జీ నుంచి తప్పించుకోవడానికి వెంకీ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ చంద్రకళ (రకుల్ ప్రీత్ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకీ చంద్రకళ కూడా వెంకీ ని ప్రేమిస్తుంది.
కట్ చేస్తే సిటీలో డాన్ అయిన సత్య (రాహుల్ దేవ్) చెల్లెలే చంద్రకళ. వెంకీ – చంద్రకళల ప్రేమ గురించి తెలుసుకున్న సత్య వెంకీని చంపేయమంటాడు. అదే సమయంలో కేశవ్ రెడ్డి (ముఖేష్ ఋషి) చంద్రకళని చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు కేశవ్ రెడ్డి ఎవరు? చంద్రకళని ఎందుకు చంపాలనుకున్నాడు? బాబ్జీకి సత్య కి ఏమన్నా సంబంధం ఉందా? వీరందరి నుంచి వెంకీ ఎలా తప్పించుకొని చంద్రకళని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది తెరపైనే చూడాలి….
ప్లస్ పాయింట్స్ :
గోపీచంద్ చాలా రోజుల తర్వాత మరోసారి పక్కింటి కుర్రాడిలా, జోష్ ఉన్న పాత్రలో కనిపించాడు. ‘రణం’ సినిమా తర్వాత కామెడీ, యాక్షన్ కలిపి చేసిన పాత్ర ఇది. రణం లోలానే గోపీచంద్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాత్రని చేసాడు. తనే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలబడి కథని ముందుకు నడిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేసాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన గత సినిమా కంటే రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమాలో బాగా చూపించారు. అలాగే సినిమా మొదటి నుంచి మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తూ తన గ్లామరస్ డోస్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించింది. గోపీచంద్ – రాకుల్ ప్రీత్ కెమిస్ట్రీ కూడా బాగుంది.
ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి ముఖ్యమైన మరో మూడు మెయిన్ పిల్లర్స్ గురించి.. వాళ్ళే సిప్పీగా కనిపించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం, బాయిలింగ్ స్టార్ బబ్లూగా కనిపించిన పృధ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ), చంద్రమోహన్. బాయిలింగ్ స్టార్ గా పృథ్వి వచ్చే నాలుగైదు సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. చెప్పాలంటే సినిమా స్లో అవుతున్న టైంలో తన ఎపిసోడ్స్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. బ్రహ్మానందం చేత చెప్పించిన సూపర్ హిట్ మూవీస్ లో బాగా ఫేమస్ అయిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. అలాగే చంద్రమోహన్ తన తింగరి చేష్టలతో కొంతవరకూ నవ్వించాడు. సెకండాఫ్ లో గోపీచంద్ – బ్రహ్మానందం – చంద్ర మోహన్ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి.
ఇక ఈ సినిమాలో ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ హంసా నందిని.. తను కేవలం ఒక పాటకి మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సీన్స్ లో కూడా కనిపించి గ్లామర్ తో ఆకట్టుకుంది. సంపత్, రాహుల్ దేవ్, ముఖేష్ రుషి, రఘుబాబు తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మరియు ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి చాలా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకి చాలా స్లోగా ఉన్న క్లైమాక్స్ లో వచ్చే లెజెండ్ ఎపిసోడ్.
మైనస్ పాయింట్స్ :
ప్రతిసారి ఇలాంటి సినిమాలకు మేము కామన్ గా చెబుతున్న మరియు మీరు రెగ్యులర్ గా చదువుతున్న మైనస్ పాయింట్లే ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే రచయితలు – దర్శకులు ఒకే పాయింట్ ని తిప్పి తిప్పి సినిమాలు తీయడం వలన.. ఇక మైనస్ పాయింట్స్ లోకి వెళితే.. కథ యాజిటీజ్ గా ఉంది.. దేనికి యాజిటీజ్ అంటేడీ, రెడీ, కందిరీగ, దూకుడు, రభస, ఆగడు ఇప్పుడు లౌక్యం.. కథల్లో బ్యాక్ డ్రాప్ లు మారిన కథలో మాత్రం పెద్ద తేడా ఉండదు. కావున ఈపాటికే మీకు కథ ఎలా ఉంటది అనేది క్లారిటీ వచ్చేసి ఉంటుంది.
ఇక రెండవ మేజర్ మైనస్ స్క్రీన్ ప్లే.. ఇది కూడా యాజిటీజ్ గానే ఉంటుంది. ఏ మాత్రం మార్పు ఉండదు. స్క్రీన్ ప్లే పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగించకపోతే ఆ సినిమా స్క్రీన్ ప్లే ఫెయిల్ అయినట్టే.. సేమ్ టు సేమ్ అదే జరిగింది.. ప్రతి ట్విస్ట్ ఆడియన్స్ ఊహించేయవచ్చు. అలాగే సినిమాలో చాలా బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా చోట్ల సినిమాని సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే పాటలు కూడా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. పాటల ఆర్డర్ మార్చి ఉండాలి అలాగే పాటలు సందర్భానుసారంగా వచ్చి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో సత్యం రాజేష్ ని సరిగా వినియోగించుకొని ఉంటే కామెడీ పండేది. ఇక లాజికల్ గా చాలానే మిస్టేక్స్ ఉంటాయి.
సాంకేతిక విభాగం :
ప్రతి సినిమాకి కథే హీరో అంటారు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతా… శ్రీధర్ సీపాన అందించిన కథ పైన చెప్పినట్టు పలు హిట్ సినిమాల కథలానే యాజిటీజ్ గా ఉంది. సో ఈయన కథ కోసం ఇసుమంతైనా కష్టపడలేదు. ఇలాంటి యంగ్ రైటర్స్ కూడా కొత్తగా ఆలోచించకుండా ఇలాంటి పరమ రొటీన్ కథలపై దృష్టి పెట్టడం, స్టార్ హీరోకి కథ ఇస్తూ కూడా స్పూఫ్ కామెడీలను నమ్ముకోవడం బాధాకరమైన విషయం. ఈ మూవీకి డైలాగ్స్ రాసింది కూడా శ్రీధర్ సీపాన. పంచ్ డైలాగ్స్ ఎక్కువగా రాసారు కానీ అందులో ఒక 60-70% పేలాయనే చెప్పాలి. అందుకే కొన్ని పార్ట్స్ లో కామెడీ వర్కౌట్ అయ్యింది. ఇక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన శ్రీవాస్ సినిమా విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆయన రాయించుకుంది రొటీన్ కాన్సెప్ట్ కావడంతో సినిమాని ఆసక్తికరంగా తీయలేకపోయారు. చాలా చోట్ల స్పెషల్ కేర్ తీసుకొని ఉండాల్సింది. ఫైనల్ గా తన గత సినిమాలనే అవుట్ పుట్ ని అందించాడు.
కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి స్క్రీన్ ప్లే రాసారు.. వారిద్దరే ఇప్పటికి చాలా సినిమాలకు ఇలాంటి కథ – స్క్రీన్ ప్లే రాసారు. సో వాళ్ళు అదే పాత సినిమాల స్క్రీన్ ప్లే దీనికి ఇచ్చారు. దాంతో సినిమా ఊహాజనితంగా మారింది. వెట్రి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తను మాత్రం తనకిచ్చిన లోకేషన్స్ మరియు నటీనటుల్ని గ్రాండ్ అండ్ కలర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అనూప్ రూబెన్స్ పాటలు ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్ గానే ఉంది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ డైరెక్టర్ తో ఇంకాస్త ఫైట్ చేసి లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా చోట్ల బోరింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కనల్ కన్నణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసుకోవాల్సింది.
తీర్పు :
గోపీచంద్ ‘సాహసం’ తర్వాత సంవత్సరంకి పైగా తీసుకొని చేసిన రెగ్యులర్ అండ్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ‘లౌక్యం’ ప్రేక్షకులను నవ్వించడంలో బాగా సక్సెస్ అయ్యింది. రొటీన్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయినప్పటికీ చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు. గోపీచంద్ ఎనర్జీ పెర్ఫార్మన్స్, పృథ్వి – బ్రహ్మానందం – చంద్రమోహన్ కామెడీ మిమ్మల్ని నవ్విస్తే, రకుల్ ప్రీత్ సింగ్ – హంసానందినిల గ్లామర్ సినిమాకున్న స్పెషల్ అట్రాక్షన్.. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా నచ్చదు, రెగ్యులర్ గా నవ్వించే నాలుగు కామెడీ బీట్స్, నాలుగు ఫైట్స్, నాలుగు పాటలు ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు వేరే ఏమీ లేనందు వల్ల ఈ సినిమా బాగానే ఆడే ఆవకాశం ఉంది. పర్ఫెక్ట్ గా సినిమాని ప్రమోట్ చేసుకుంటే గోపీచంద్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా నిలిచే అవకాశం ఉంది.